నా చదువు ౮ వరకు ఒక అచ్ఛమైన హిందూ సాంప్రదాయ పాఠశాలలో జరిగింది.మాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా అనేక శాఖల్లో విస్తరించిన(కొంచెం ఎక్కువైందా) పాఠశాల...మామూలుగా ఉండే పాఠాలతో పాటు మాకు సదాచారం గొడ్డుకారం లాంటి ఎక్స్ట్రా సబ్జక్ట్స్ కూడా బోధించేవాళ్ళు అదీ తె.మీ లో(తెలుగు మీడియం) మా తాతయ్య కి భాషాభిమానం తో పాటు కూసంత చాదస్తం ఎక్కువ. సో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనుకుంటూ నన్నక్కడ పడేశారు. దాంతో నా చిన్ననాటి చదువు చాలావరకు అక్కడే జరిగింది ...పొద్దున తొమ్మిదింటికి ప్రార్థన తో మొదలయ్యే మా స్కూల్ సాయంత్రం ఐదింటికి ముగిసేది.అసలే మాది సంప్రదాయ బద్దమైన పాఠశాల కాబట్టి రీసస్ బెల్ కి ముందు ధ్యానం, లంచ్ కి ముందు భోజనమంత్రం,సాయంత్రం శాంతి మంత్రం చదవనిదే ఎవడు కదలటానికి వీల్లేదు. వారానికో పిచ్చి రూల్ పెట్టి బుర్ర తినే మా ప్రధానోపాధ్యాయులు (హెడ్ మాస్టర్) గారు ఒక రోజు రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదనే కసితో ఇక నుంచి అందరు రాత్రి పడుకునే ముందు కూడా ఒక సోది మంత్రం చదవాలని ఒక సర్కులర్ పంపాడు. మా ఆచార్యజీలు (సార్లు),మాతాజీలు(మేడంలు) రొజూ మా ప్రధానోపాధ్యాయుల వారి గోల భరించ లేక.. ఆ కోపాన్ని మా మీద చూపించేవాళ్ళు పాపం అమాయకులు... ఇదీ బ్రీఫ్ గా మా స్కూల్ ఇంట్రడక్షన్... ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వచ్చే పదహార్న వచ్చే రక్షా బంధన్ పండగ.... రాఖి పండక్కి వీడి పాఠశాల కి లింకేంటి అనుకుంటున్నారా....... అదే మరి
మీకు రాఖీ అంటే అందరిలా కేవలం అక్క చెల్లెళ్లకి,అన్నతమ్ముళ్ళకి రాఖీలు కట్టడం మాత్రమే తెలుసు..కాని మా స్కూల్ లో ఏ రాయిని రప్పని కదిలించినా వాటి గోడు వెల్ల బోసుకుంటాయి.....మీకొ చిన్న ఉదాహరణిస్తా .....
"ఆ రోజు రాఖి పండగ... పొద్దున 8 కల్లా అందరం మైదానం లో గణ వేషం(యూనిఫాం) లో లైన్లో నుంచున్నాం . అక్కడ స్టేజి పైన వేసిన కుర్చీల్లో మా హెడ్డు సుబ్బరాజు గాడు, మా పాఠశాల కార్యదర్శి (సెక్రెటరి) నాగరాజు గాడు,ఒక లింగ రాజు మరో త్యాగరాజు గారు కుర్తా పైజామాల్లో తెగ మెరిసిపోతున్నారు.... అందరు గంటేసి లెక్చర్లు పీకాక ఎట్టకేలకు మా నాగరాజు గారి వంతొచ్చింది.... ఆయనగారికి నాలాగే కూసంత కళాపోసనెక్కువ..... ఎక్కడికెళ్ళినా ముందుగా రెడి చేస్కున్న కవితొకటి తన సంచీలోంచి తీసి విన్పిస్తుంటారు. కాకుంటే అది ఎదుటి వాళ్ల ప్రాణాలమీదికొచ్చేది... ఆ రోజు షరా మాములుగా తెచ్చుకున్న కవితను తన చేతి సంచి నుంచి తీసి విన్పించడం మొదలు పెట్టాడు ... "అమ్మ నాన్న పంపద్దు....మమ్మీ డాడీ కాన్వెంటుకు ......" అంటూ మొదలుపెట్టాడు. దీంతో ఇంతసేపూ ప్రశాంతంగా బజ్జున్న మా హెడ్డు గాడు ఉలిక్కి పడి లేచి బుర్ర గోక్కున్నాడు.... ఇక అర్జెంటుగా పోడియం దగ్గరికెళ్ళి మైకు లగేస్కుని జై హింద్ అనేసరికి అందరం ఊపిరి పీల్చుకున్నాం....
ఇక అసలు తంతు.....
ఇక అసలు తంతు.....
బాలుర బాలికలందరిని(అబ్బాయిలు అమ్మాయిలు) వరుసలలో నుంచో బెట్టి చేతికి నారింజ రంగు నోముదారాలిచ్చి అదే మీ భాషలో ఐతే రాఖీ లు కట్టమని చెప్పేవాళ్ళు......ఇది చాలదన్నట్టు కట్టేపుడు ఒక డైలాగ్ కూడా "నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష" ...కట్టేపుడు అమ్మాయిల మొహాలు చూడలేక.... ఇక మా బాధ మీకు తెలిసే ఉంటుంది. ఇక అయిపొయిదనుకంటే మీరు పప్పులో కాలేసినట్టే .ఇక మొదలవుద్ది అసలు కథ శొభాయాత్ర మొదలు అంటే మన ఆంగ్లం లొ ప్రొసెషన్ లాంటిదన్నమాట .... ముందు ఇద్దరు బాలురు ఒక మా స్కూల్ బానర్ పట్టుకుని నుంచుంటే వెనక మెం తయారయ్యేవాళ్ళం.. దార్లో కనిపించే ప్రతి అడ్డమైన వాడిదగ్గరికెళ్ళి వాడి చెయ్యి లాగేసుకుని "నువ్వు నాకు రక్ష...నేను నీకు రక్ష" అని మొదలెట్టేసరికి .... ఒక్క నిముషం ఏం జరుగుతుందో అర్థం కాని ఎదుటి వాడు తేరుకుని చిల్లర లేదు పో అంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక వాడికి మా స్కూల్ పద్ధతులు వివరించి ఇంకో ఆసామిని వెతుక్కునే వాళ్ళం....ఇంతా చెస్తే చివర్లో డిస్పర్స్ అయేటపుడు రెండు నారింజ మిఠాయిలు చేతిలో పెట్టి పండగ చేసుకోమని చెప్పేవాళ్ళు
మా స్కూల్ లో ఒక ముస్లిం అమ్మాయుండేది....తనకి మన హిందు పద్ధతులన్నా ఆచారాలన్నా బాగా ఇష్టం.... కాని మా స్కూల్ లో చేసేవే అసలు పద్ధతులనుకుని పొరపడుతుంటుంది పాపం.అలా ఒక రోజు మా పాత ఫ్రెండొకడు ఎపుడో రెండేళ్ళ క్రితం వేరే స్కూలుకెళ్ళి ప్రశాంతంగా చదువుకుంటుంటే అక్కడికెళ్ళిపోయి బుద్ధిగా క్లాస్ వింటున్న వాణ్ణి అర్జెంటుగా బయటకు పిలిచి చెయి లాగేస్కుని"నేను నీకు రక్ష ..." అంటూ మొదలుపెట్టింది. ఆ భాషేంటో అర్థం కాని వాడి ఫ్రెండ్స్ పాపం బిత్తరపోయారట.
"పపద్దతులు ఎలా ఉన్నా నా ప్రస్థుత స్థానానికి కారణమైన మా స్కూల్ అంటే నాకెపుడూ అభిమనామే....ఎందుకంటే అది నాకు సంస్కారం తో పాటు ఎన్నో జ్ఞాపకాల్ని ఇచ్చింది....అందుకే వీలు దొరికినపుడల్లా మా స్కూలుకెల్తుంటా... ఇపుడు సుబ్బరాజు లేడు నాగరాజు లేడు ఆ తీపి గుర్తులు తప్ప...... "



2 comments:
gundaloo roju sudhulatho guchadhi chaladhanattu, yakanga gunapamtho thayaru aayav yanti anna , pindasav anna, pindasav.
Post a Comment