12:05 PM

వర్షం

సూరీడొచ్చే వేళలో మబ్బై ముసిరావే
వాడిపోయిన హృదయం పై జల్లై కురిశావే
తడిసి ముద్దైన ఎదలో వెచ్చటి సెగ రేపావే
మూగవోయిన మనసున చినుకై సవ్వడి చేసావే
ఓ వర్షమా ఆగిపొకే ఈ మది చిగురించేదాకా ..!

12:52 PM

చిన్ని కోరిక

బిల్ గేట్స్ మదిలో ఉదయించి,
మైక్రోసాప్హ్ట్ గా సాకారమైన స్వప్నమా,
క్సీనిక్స్ తో మొదలైన ప్రయాణం డాస్ తో చిగురించి

గణన యంత్రపు విశేషాలన్ని విండోస్ లో పదిలం చేసి
యంత్రాల్లా మారిన మనుషులకు ఆఫీస్ సూట్ ని పరిచయం
చేసిరంగుల లోకపు కిటికీలు తెరిచావే

వెబ్ ప్రపంచపు ఊసులన్ని ఎక్స్ ప్లోరెర్ లో బంధించి,
ఎంకి పాటలు రాసే నాకు .నెట్ లొ ప్రోగ్రాం నేర్పి,
మనుషుల మధ్య దూరం పెరిగిన ఈ 64 బిట్ ప్రపంచంలొ ఎక్స్ బాక్స్ తో పలకరించి ,
భవిష్యత్ నాదే అంటూ కంప్యూటర్ ప్రపంచాన్ని నడిపించావే...

రోజు రోజుకీ చిన్నదైపోతున్న ఈ గ్లోబల్ కుగ్రామంలో
తనకు తానే గిరి గీసుకుంటున్న ఈ మనుషుల మధ్య సరిహద్దులు చెరిపేయగలవా !

మనస్సుని సైతం గూగుల్ లో వెతికే ఈ మనుషులకి

ఒక స్పందించే హృదయం అందించగలవా !

మానవత్వం మర్చిపోయిన ఈ జనసంద్రానికి

అనురాగం ఆప్యాయతలు నిండిన ఓ సరికొత్త ప్రపంచం నిర్మించగలవా!!

సాఫ్ట్ వేర్ హోరులో కొట్టుకు పోతున్న నా ఈ చిన్ని కోర్కెలు తీర్చగలవా !!!...



4:11 PM

జాబిలి సందేశం

మబ్బు చాటున జాబిలమ్మా సిగ్గుపడతావే ..
చీకటమ్మ ఒడిలోన మెరిసిపోతావే .....
అరవిచ్చిన వేలకలువలు ఎదురుచుడంగ..
శరత్కాలపు నడు నిశిలో వెల్లి విరిశావే...
ఉవ్వెత్తున ఎగసిపడే సాగర కెరటాలకు....
ఉత్తుంగ తరంగపు సరిగమలు నేర్పావే .........
తమస్సు నిండిన ఈ మనుష్యలోకాన కోటికాంతులు నింపగలవా...
జాడ్యంలో కొట్టు మిట్టాడే ఈ పాడు లోకంలో పండు వెన్నెల కురిపించగలవా ....

11:03 PM

వెతుకుతూ ఉన్నా.....

చిల్లు పడిన లాంతరు వెలుగులు చీకటమ్మను తరుముతుంటే,
అజ్ఞాతంలో తమలొ దాగిన తమను చూస్తే భయం,
మబ్బులు కమ్మిన చంద్రుడు నిశీథినిలో మాసిపొతే,
గతంలో కూరుకుపోయిన తమను చూస్తే భయం,
చప్పబడిన నిన్నటి మాటలే మాత్లాడుతూ,
బూజుపట్టిన నిన్నటి కలల్నే తల్చుకుంటూ,
ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మంలా భావిస్తూ ,
తోక తెగిన ఎలుకల్లా కలుగునుంచి బయటకురాని ఆ జీవాలకు
అందమైన అబద్ధాలే మోజేమో......

నేను మాత్రం కవిత్వమనే కుచ్చుటోపి తో ,
చీకటి నవ్విన వెలుతుర్లో ,
దారి మాటున మూగగా రోదిస్తున్న మోడుచెట్ల గోడు వింటూ,
కృత్రిమమైన మనసులు,మాటలు నిండిన ఈలోకంలో,
నిజాయితీగా పలికే నిండు గొంతుకై వెతుకుతూ ఉన్నా

8:59 AM

నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష



నా చదువు ౮ వరకు ఒక అచ్ఛమైన హిందూ సాంప్రదాయ పాఠశాలలో జరిగింది.మాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా అనేక శాఖల్లో విస్తరించిన(కొంచెం ఎక్కువైందా) పాఠశాల...మామూలుగా ఉండే పాఠాలతో పాటు మాకు సదాచారం గొడ్డుకారం లాంటి ఎక్స్ట్రా సబ్జక్ట్స్ కూడా బోధించేవాళ్ళు అదీ తె.మీ లో(తెలుగు మీడియం) మా తాతయ్య కి భాషాభిమానం తో పాటు కూసంత చాదస్తం ఎక్కువ. సో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనుకుంటూ నన్నక్కడ పడేశారు. దాంతో నా చిన్ననాటి చదువు చాలావరకు అక్కడే జరిగింది ...పొద్దున తొమ్మిదింటికి ప్రార్థన తో మొదలయ్యే మా స్కూల్ సాయంత్రం ఐదింటికి ముగిసేది.అసలే మాది సంప్రదాయ బద్దమైన పాఠశాల కాబట్టి రీసస్ బెల్ కి ముందు ధ్యానం, లంచ్ కి ముందు భోజనమంత్రం,సాయంత్రం శాంతి మంత్రం చదవనిదే ఎవడు కదలటానికి వీల్లేదు. వారానికో పిచ్చి రూల్ పెట్టి బుర్ర తినే మా ప్రధానోపాధ్యాయులు (హెడ్ మాస్టర్) గారు ఒక రోజు రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదనే కసితో ఇక నుంచి అందరు రాత్రి పడుకునే ముందు కూడా ఒక సోది మంత్రం చదవాలని ఒక సర్కులర్ పంపాడు. మా ఆచార్యజీలు (సార్లు),మాతాజీలు(మేడంలు) రొజూ మా ప్రధానోపాధ్యాయుల వారి గోల భరించ లేక.. ఆ కోపాన్ని మా మీద చూపించేవాళ్ళు పాపం అమాయకులు... ఇదీ బ్రీఫ్ గా మా స్కూల్ ఇంట్రడక్షన్... ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వచ్చే పదహార్న వచ్చే రక్షా బంధన్ పండగ.... రాఖి పండక్కి వీడి పాఠశాల కి లింకేంటి అనుకుంటున్నారా....... అదే మరి

మీకు రాఖీ అంటే అందరిలా కేవలం అక్క చెల్లెళ్లకి,అన్నతమ్ముళ్ళకి రాఖీలు కట్టడం మాత్రమే తెలుసు..కాని మా స్కూల్ లో ఏ రాయిని రప్పని కదిలించినా వాటి గోడు వెల్ల బోసుకుంటాయి.....మీకొ చిన్న ఉదాహరణిస్తా .....
" రోజు రాఖి పండగ... పొద్దున 8 కల్లా అందరం మైదానం లో గణ వేషం(యూనిఫాం) లో లైన్లో నుంచున్నాం . అక్కడ స్టేజి పైన వేసిన కుర్చీల్లో మా హెడ్డు సుబ్బరాజు గాడు, మా పాఠశాల కార్యదర్శి (సెక్రెటరి) నాగరాజు గాడు,ఒక లింగ రాజు మరో త్యాగరాజు గారు కుర్తా పైజామాల్లో తెగ మెరిసిపోతున్నారు.... అందరు గంటేసి లెక్చర్లు పీకాక ఎట్టకేలకు మా నాగరాజు గారి వంతొచ్చింది.... ఆయనగారికి నాలాగే కూసంత కళాపోసనెక్కువ..... ఎక్కడికెళ్ళినా ముందుగా రెడి చేస్కున్న కవితొకటి తన సంచీలోంచి తీసి విన్పిస్తుంటారు. కాకుంటే అది ఎదుటి వాళ్ల ప్రాణాలమీదికొచ్చేది... ఆ రోజు షరా మాములుగా తెచ్చుకున్న కవితను తన చేతి సంచి నుంచి తీసి విన్పించడం మొదలు పెట్టాడు ... "అమ్మ నాన్న పంపద్దు....మమ్మీ డాడీ కాన్వెంటుకు ......" అంటూ మొదలుపెట్టాడు. దీంతో ఇంతసేపూ ప్రశాంతంగా బజ్జున్న మా హెడ్డు గాడు ఉలిక్కి పడి లేచి బుర్ర గోక్కున్నాడు.... ఇక అర్జెంటుగా పోడియం దగ్గరికెళ్ళి మైకు లగేస్కుని జై హింద్ అనేసరికి అందరం ఊపిరి పీల్చుకున్నాం....

ఇక అసలు తంతు.....
బాలుర బాలికలందరిని(అబ్బాయిలు అమ్మాయిలు) వరుసలలో నుంచో బెట్టి చేతికి నారింజ రంగు నోముదారాలిచ్చి అదే మీ భాషలో ఐతే రాఖీ లు కట్టమని చెప్పేవాళ్ళు......ఇది చాలదన్నట్టు కట్టేపుడు ఒక డైలాగ్ కూడా "నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష" ...కట్టేపుడు అమ్మాయిల మొహాలు చూడలేక.... ఇక మా బాధ మీకు తెలిసే ఉంటుంది. ఇక అయిపొయిదనుకంటే మీరు పప్పులో కాలేసినట్టే .ఇక మొదలవుద్ది అసలు కథ శొభాయాత్ర మొదలు అంటే మన ఆంగ్లం లొ ప్రొసెషన్ లాంటిదన్నమాట .... ముందు ఇద్దరు బాలురు ఒక మా స్కూల్ బానర్ పట్టుకుని నుంచుంటే వెనక మెం తయారయ్యేవాళ్ళం.. దార్లో కనిపించే ప్రతి అడ్డమైన వాడిదగ్గరికెళ్ళి వాడి చెయ్యి లాగేసుకుని "నువ్వు నాకు రక్ష...నేను నీకు రక్ష" అని మొదలెట్టేసరికి .... ఒక్క నిముషం ఏం జరుగుతుందో అర్థం కాని ఎదుటి వాడు తేరుకుని చిల్లర లేదు పో అంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక వాడికి మా స్కూల్ పద్ధతులు వివరించి ఇంకో ఆసామిని వెతుక్కునే వాళ్ళం....ఇంతా చెస్తే చివర్లో డిస్పర్స్ అయేటపుడు రెండు నారింజ మిఠాయిలు చేతిలో పెట్టి పండగ చేసుకోమని చెప్పేవాళ్ళు

మా స్కూల్ లో ఒక ముస్లిం అమ్మాయుండేది....తనకి మన హిందు పద్ధతులన్నా ఆచారాలన్నా బాగా ఇష్టం.... కాని మా స్కూల్ లో చేసేవే అసలు పద్ధతులనుకుని పొరపడుతుంటుంది పాపం.అలా ఒక రోజు మా పాత ఫ్రెండొకడు ఎపుడో రెండేళ్ళ క్రితం వేరే స్కూలుకెళ్ళి ప్రశాంతంగా చదువుకుంటుంటే అక్కడికెళ్ళిపోయి బుద్ధిగా క్లాస్ వింటున్న వాణ్ణి అర్జెంటుగా బయటకు పిలిచి చెయి లాగేస్కుని"నేను నీకు రక్ష ..." అంటూ మొదలుపెట్టింది. ఆ భాషేంటో అర్థం కాని వాడి ఫ్రెండ్స్ పాపం బిత్తరపోయారట.

"పద్దతులు ఎలా ఉన్నా నా ప్రస్థుత స్థానానికి కారణమైన మా స్కూల్ అంటే నాకెపుడూ అభిమనామే....ఎందుకంటే అది నాకు సంస్కారం తో పాటు ఎన్నో జ్ఞాపకాల్ని ఇచ్చింది....అందుకే వీలు దొరికినపుడల్లా మా స్కూలుకెల్తుంటా... ఇపుడు సుబ్బరాజు లేడు నాగరాజు లేడు ఆ తీపి గుర్తులు తప్ప...... "

8:53 AM

మరువలేని నేస్తం....

వసంతకాలపు ఉషొదయంలో కూజించే కోకిలలాచెప్పావే ఊసులెన్నో,మలిచావే ఆశలెన్నో....
కట్టానే గుండె గూటిని గిజిగాడే ఈర్ష్యపడగా
నేను మాత్రం మనిషినేగా ఎలా మరువను నేస్తమా.......
మధ్యాహ్నపు మందుటెండ జడలు విప్పి నర్తిస్తుంటే
వింధ్యా మారుతమై సేదతీర్చావే,సాగర సరంగమై మదిని తాకావే....
ఎదురు చూశా ఎద తలుపు తెరచి కనులు మూతలే పడగా....
నేను మాత్రం మనిషినేగా ఎలా మరువను కాలమా...
ఎరుపెక్కిన సంధ్యా జ్వాలలు పగటికి చితిని పేరిస్తే..శరత్కాలపు చంద్రమై వెన్నెల కురిపించావే ,
నా మది లయకు స్వప్న వంసీరవమై తోడు నిలిచావే...
తరచి చూశా గుండె లోతును గుండె బద్దలే అవగా....
నేను మాత్రం మనిషినేగా ఎలా మరువను మౌనమా..

8:48 PM

స్వార్థం లేని ఇగో



స్వార్థం...ప్రతి మనిషికి..ఇంకా చెప్పాలంటే ప్రతి జీవికీ,చెట్టుకి,పుట్టకి ఉంటుంది... నన్నడిగితే మనిషికి తిండెంత అవసరమో స్వార్థం కుడా అంతే అంటాను.ఉదాహరణకి ఒక పూలు పూచిన మొక్కనే తీస్కుందాం.మకరందం కోసం తుమ్మెద వాలుతుంది అది దాని స్వార్థం,ఆ విషయం మొక్కకి కూడా తెలుసు,కాని మొక్కకీ ఓ స్వార్థం, పువ్వు కాయవ్వాలని...... దాని స్వార్థం లోనూ తప్పులేదు.కాయలు కాచాక మొక్కకి తుమ్మెదతో పనుండదు,అలాగే తుమ్మెదకీ మొక్క పనికి రాదు... మళ్ళీ పూలు పూచేదాక... అది యూనివర్సల్ ఫాక్ట్.ఈ విషయం తెలిసి కూడా మొక్క తుమ్మెద ని తిట్టి పోసిందట... ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకిస్తున్నానంటే ....మొన్నటికి మొన్న మా ఫ్రెండ్(పేరు అప్రస్తుతం... మా వాణ్ణి నేను బాబాయ్ అని పిలుస్తా...సో అలగే కంటిన్యూ ఐపోదాం ) గాడు నన్ను స్వార్థపరుడనేసరికి నాకు గొంతులో వెలక్కాయ పడ్డట్టంపించింది...వెంటనే వాడి ఆరోపణకి కారణం తెల్సుకునే పనిలో పడ్డా.చివరికి ఆ కారణం వినేసరికి దిమ్మ తిరిగింది....."నేను సరదాగా బయటికెళ్దాం రా అనడగడం నా స్వార్థానికి నిదర్శనమట" ఇదీ వాడి సమాధానం.కాస్సేపటికి తేరుకుని పూర్తిగా సెలవివ్వండి మహానుభావా అని అడుక్కుంటే ఇలా వివరణిచాడు..... నేను అందరితో కలుపుగోలుగా ఉంటాను, ఒంటరిగా ఉండడం నచ్చదు.మా వాడు అందుకు భిన్నం.బయటికెళ్ళడానికి ఒక్కణ్ణే వెళ్ళటానికి ఇష్టం లేక పిలిస్తే అందులో తోడు కావాలనే నా స్వార్థం వాడికి మింగుడుపడక చివరికి కక్కేసాడట...వాడి బాధకి కారణం విన్నాక నవ్వాలో ఏడ్వాలో అర్థం కాక అనవసరం గా ఒక హృదయాన్ని గాయపర్చానని ఫీల్ అయ్యి ఊరుకున్నా....ఇకనైన నా స్వార్థాన్ని తగ్గించుకుని నలుగురికి మేలుచేయలని ఆ రోజే ఫిక్స్ ఐపొయా .

మా బాబాయి కి ఇంకో అలవాటుంది.... ఏం చేసినా ఎక్కడికెళ్ళినా ఒక్కడే చేయాలనుకోవడం....ఆ క్రెడిట్ కొట్టేయాలనుకోవడం ...కానీ కొన్ని విషయాల్లో దెబ్బైపోతుంటాడు....ఇలా ఐన ప్రతి సారి ఫీల్ అవ్వడం,వాణ్ణి చూసి మేం ఫీల్ అవ్వడం మాకు రొటీన్ .ఎందుకంటే మవాడు "ఒకడు చెప్తే చెయ్యను..నాకు చెయ్యలనిపిస్తే చేస్తాను" అనే పోకిరి టైపు.స్వార్థానికీ,ఇగో(అహం) కి చిన్న అంతరం ఉంది.....మన గురించి మనం ఎక్కువగా ఊహించుకున్నపుడు గానీ,మనల్ని పక్కవాడు తక్కువ చేసినపుడు గానీ మన ఈగో బయటికొస్తుంటుంది....అప్పుడే "నేను" అనే వ్యక్తి బయటకొస్తుంటాడు... ఇంగ్లీషులో "Should be personality" అంటారు.నేను ఇలా చేయాలి.ఇలా ఉండాలి అనుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుందని చాలా మంది ఫీల్ అవ్వచు అది కొంత వరకు నిజం కావచ్చు కుడా.కానీ ఇలానే ఉంటా ఇలానే చేస్తా అనుకోవడాన్ని ఒకరకంగా సెల్ఫ్ ఈగో అనచ్చు. కొన్ని సార్లు దీనివల్ల కొన్ని రిలేషన్స్ కూడా దెబ్బతిటుంటాయ్.....ఉదాహరణకి స్నేహం,పెళ్ళి లాంటివి.... ఈ రకమైన సంబంధాల్లో ముఖ్యంగా ఉండాల్సింది పరస్పర అవగాహన..... మనం అవతలి వ్యక్తి ఇలానే ఉండాలి అని కోరుకున్నపుడు గానీ,ఒకరిలో ఈగో(నాకన్ని తెలుసు అనే భావన) పెరిగినపుడు గాని ఇంకొకళ్ళు బాధితులవుతారు.


సొంత నిర్ణయాలు తీస్కోవడం,స్వతంత్ర భావాలు కలిగి ఉండడం చాలా మంచిది ఇంకా చెప్పాలంటే అవసరం కూడా... కానీ అది హద్దులు దాటితేనే వచ్చే చిక్కల్లా....మన హద్దులు దాటకుండా మన చుట్టూ ఉండే వాళ్ళ భావాలనూ అర్థం చేస్కోగలిగితే ఇక లైఫ్ లో ఎప్పుడూ హ్యాపీనే.........